Thursday, May 1, 2014

How to Prepare for Diet Cet Exam?


తక్కువ వయస్సులో పక్కాగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజమార్గం. కేవలం ఇంటర్ అర్హతతో ఈ కోర్సు చేస్తే చాలు. ఆకర్షణీయమైన జీతం. విద్యార్హతలు పెంచుకుంటూ, ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం. స్వంత జిల్లాలో ఉన్న ఊరికి దగ్గర్లో దేశసేవ చేసుకొనే భాగ్యం. వీటన్నింటికి తొలి ప్రస్థానం డీఎడ్ సీటు సాధించడం. డీఎడ్‌లో ప్రవేశాల కోసం విద్యాశాఖ ప్రవేశపరీక్షను నిర్వహిస్తుంది. దీనిలో మంచి ర్యాంకు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 190 కాలేజీల్లో డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. డీఈఈసెట్(డైట్‌సెట్) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్ నేటి ప్రత్యేకం....

విద్యాహక్కు చట్టం అమలులోకి రావడంతో ప్రభుత్వాలు విద్య కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా నిర్భంద ప్రాథమిక విద్య అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దష్టిసారించాయి. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు మాత్రమే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అర్హులని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ కోర్సు చేసిన వారికి డిమాండ్ మరింత పెరిగింది.

పోస్టుల సంఖ్య భారీగా ఉండటం, డీఎడ్ చేసిన వారి సంఖ్య దానికి తగట్టుగా లేకపోవడంతో ఈ కోర్సు చేస్తే ఉద్యోగం గ్యారంటీ అనే పరిస్థితి నెలకొంది. గత రెండు డీఎస్సీల్లో డీఎడ్ కోర్సు చేసిన వారు లేకపోవడంతో ఎస్‌జీటీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పలు కేంద్ర పథకాలతో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పరిస్థితుల్లో విద్యపై మరింత శ్రద్ధ తీసుకొనే అవకాశం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అవసరమయ్యే పోస్టులను కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నింపాల్సిన పరిస్థితి.

వీటన్నింటి నేపథ్యంలో తప్పనిసరిగా భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పాత రాష్ట్రంలో 22వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. వీటికి తోడు పదవీవిరమణ ద్వారా మరికొన్ని, పాఠశాలల అప్‌గ్రేడ్‌తో ఇంకొన్ని పోస్టులు కలువనున్నాయి. రానున్న రెండు మూడేళ్లలో భారీగా ఉపాధ్యాయ పోస్టులు తప్పనిసరిగా నింపాల్సిన పరిస్థితి.


డీఈఈసెట్


గత సంవత్సరం వరకు డైట్‌సెట్‌గా పిలిచిన ఈ పరీక్షను ఈసారి నుంచి డీఈఈగా మార్చారు. దీనికి కారణం డీఎడ్‌ను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ)గా మార్చడం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వేల సీట్లు ఉన్నాయి. గతేడాది సుమారు ఐదులక్షల మందికి పైగా డీఎడ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. దీనికి కారణం గతరెండేళ్లుగా నోటిఫికేషన్స్ లేకపోవడం, కొత్త రాష్ర్టాలు ఏర్పడటం, భవిష్యత్‌లో నోటిఫికేషన్స్ రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉండటం. ఈ నేపథ్యంలో డీఈఈ సెట్‌కు పక్కా ప్రణాళికతో చదివితే తప్ప మంచి ర్యాంకు వచ్చే అవకాశం లేదు. మంచి ర్యాంకు రాకుంటే సీటూ రాదు. 
అర్హతలు: ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 
వయస్సు: 17 ఏళ్లు దాటి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
ప్రశ్న పత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. సమయం రెండు గంటలు. అంటే 120 నిమిషాల్లో 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు 8,9, 10 తరగతుల్లో ఉన్న సబ్జెక్టు నుంచే వస్తాయి.
క్వాలిఫైయింగ్ మార్కులు: డీఈఈ సెట్‌లో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు రావాలి. అంతకన్నా తక్కువ వస్తే మెరిట్‌లిస్ట్‌కు ఆ అభ్యర్ధిని పరిగణలోకి తీసుకోరు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు నిర్దేశిత మార్కులు సాధించాల్సిన అవసరం లేదు. 

ప్రిపరేషన్ ప్లాన్

జనరల్ నాలెడ్జ్ :


ఈ విభాగానికి ఐదు మార్కులు కేటాయించారు. జనరల్ నాలెడ్జ్‌లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన అంశాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. క్రీడలు, అవార్డులు, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలు, కొత్త గ్రంథాలు, నియామకాలు, అధ్యయనాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉదా: ఫిబ్రవరి 15, 2013న ప్రపంచంలోనే అతి ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1) పాట్నా 2) హైదరాబాద్ 3) అహ్మదాబాద్ 4) భువనేశ్వర్
ముఖ్యమైన ప్రశ్నలు: ఈ సంవత్సరం జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది? ఏ పుస్తకానికి? ఆ వ్యక్తి ఏ రాష్ర్టానికి చెందిన వారు?
ప్రస్తుతం జరిగిన ఎన్నికలు ఎన్నోవి? ఓటింగ్‌కు సంబంధించిన ప్రాథమికాంశాలపై అడిగే అవకాశం ఉంది.
ఈ విభాగం కోసం ఎక్కువ శ్రమకోర్చాల్సిన పనిలేదు. దీని సిలబస్ విస్తతం. కాబట్టి గతేడాదిగా జరిగిన అంశాలపై మార్కెట్‌లో లభించే ఏదైనా ఒక పుస్తకాన్ని చదివితే సరిపోతుంది.



టీచింగ్ ఆప్టిట్యూడ్


వత్తిపట్ల విద్యార్థి దక్పథాన్ని తెలుసుకొనేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. అభ్యర్థికి ఉపాధ్యాయ వత్తి, తరగతి గది నిర్వహణ, పాఠశాల వాతావరణం, బోధన తదితర అంశాలపై ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. అయితే విద్యార్థులకు ఇది కొత్త అంశం. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. విద్యార్థి తార్కికంగా ఆలోచించి జవాబు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి ఐదు మార్కులు ఉంటాయి.
గత డైట్‌సెట్‌లో అడిగిన ప్రశ్నలు: 
1. బోధన అంటే? 2. తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించేవారు?
3. దొంగతనం అలవాటు ఉన్న పిల్లవాడిని నియంత్రించాల్సిన విధానం?
వీటి కోసం కొంచెం తార్కికంగా ఆలోచిస్తే జవాబులు వస్తాయి. పాత ప్రశ్న పత్రాలు, మోడల్‌పేపర్స్ ప్రాక్టీస్‌తో ఈ విభాగంలో ఐదు మార్కులు సాధించవచ్చు.


జనరల్ ఇంగ్లీష్


ఈ విభాగానికి 10 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్‌లో అధిక మార్కులు సాధించడానికి 8 - 10 తరగతి వరకు పాఠ్యాంశాల వెనుకనున్న గ్రామర్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎక్కువగా టెన్సెస్, కొశ్చన్‌ట్యాగ్, ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్, వాయిస్‌లపై ప్రశ్నలు అడుగుతారు. గత ప్రశ్న ప్రతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు...
1. Choose the correct sentence 
A) I am thinking you are wrong B) I have thought you are wrong
C) I think you are wrong D) I was thinking you are wrong

text
తెలుగు


ఈ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. కొంచెం శ్రమిస్తే 20కి 20 సాధించవచ్చు. 8 -10 పాఠ్యపుస్తకాలు చదివితే చాలు. తెలుగు భాషపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. దీనిలో ఎక్కువ ప్రశ్నలు వ్యాకరణం నుంచే వస్తాయి. సంధులు, సమాసాలు, అలంకారాలు, అర్థాలు, క్రియలు, జాతీయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 2013 డైట్‌సెట్ పేపర్‌లో అడిగిన ప్రశ్నలు చూద్దాం....
1. హవ్యవాహనుడు? 
2) అవ్వాన అనే పదం ఏ సంధి రూపం?
3) మీగడ ఏ సంధికి ఉదాహరణ?
4) డా.బోయి విజయ భారతి రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక...?
5) కనుదామరలు అనే పదం ఏ సమాసానికి ఉదాహరణ?


మ్యాథ్స్:


దీనికి 20 మార్కులు కేటాయించారు. ఇందులో 8 - 10 తరగతి పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువగా విద్యార్థి గణిత జ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ద్విపద సిద్ధాంతం, సమితులు, ఘాతాంకాలు, క్షేత్రగణితం, రేఖాగణితం, త్రికోణమితి, మాత్రికలు, శ్రేఢులు వంటి ముఖ్యమైన చాప్టర్స్ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. 8 తరగతి నుంచి 10 వరకు ప్రతి అధ్యయనంలో సూత్రాలను, ముఖ్యవిషయాలను రాసుకొని లెక్కలను ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. మ్యాథ్ అభ్యర్థులైన, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులైనా గతంలో చదివిన అంశాలే కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రాక్టీస్ చేస్తే చాలు 20కి 20 సాధించే సెక్షన్ ఇది.


ఫిజిక్స్, బయాలజీ


దీనిలో భౌతిక, రసాయన శాస్ర్తాల నుంచి 10 మార్కులు, జీవశాస్త్రం నుంచి 10 మార్కులు వస్తాయి. మొత్తం 20 మార్కులు. ఇవి కూడా నిర్దేశిత సిలబస్ నుంచే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషణతో చూస్తే ఎక్కువ ప్రశ్నలు ధ్వని, ఆధునిక భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, కాంతి, రసాయన బంధాలు, పరమాణు నిర్మాణం, ఆమ్లాలు-క్షారాలు తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. జీవశాస్త్రం విషయానికి వస్తే జీవన విధానాలు, సమన్వయం, నియంత్రణ, ప్రత్యుత్పిత్తి, పోషణ, ఎయిడ్స్ తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. గత ప్రశ్నలు దిగువన చూద్దాం....
1. సమవత్తాకార చలనంలో ఉన్న వస్తువు కోణీయ వేగం?
2. గ్లూకోజ్ కేలోరిఫిక్ విలువ?
3. ధ్వని వేగం దేనిలో ఎక్కువ?
4. వేప చెట్టు శాస్త్రీయ నామం?
5. పెన్సిలిన్ దేని నుంచి తయారు చేస్తారు?


సాంఘికశాస్త్రం


ఈ విభాగానికి కూడా 20 మార్కులు కేటాయించారు. సోషల్‌లోని నాలుగు విభాగాలను ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. సిలబస్‌లోని ప్రతి చాప్టర్‌ను అధ్యయనం చేసి సొంతంగా నోట్స్ రాసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. భూగోళం నుంచి అక్షాంశాలు, రేఖాంశాలు, ప్రకతి సిద్ధమండలాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. చరిత్ర నుంచి ఎక్కువగా భారతదేశం, ఆధునిక ప్రపంచం, ప్రాచీన నాగరికతలు, విశేషాలు వంటి చాప్టర్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పాలిటీలో స్థానిక స్వపరిపాలన, రాజ్యాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, రవాణవిద్యపై ప్రశ్నలు ఉంటున్నాయి. ఆర్థికశాస్త్రంలో ద్రవ్యం, బ్యాంకింగ్, డిమాండ్, ప్రణాళికలు చాప్టర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు. 


గత డైట్‌లో ప్రశ్నలు పరిశీలిస్తే...


1. భూమి తన అక్షం చుట్టూ తాను ఒక డిగ్రీ భ్రమణం దూరం తిరగడానికి పట్టే సమయం?
2. ఆర్కిటిక్ వలయం అంటే?
3. కింది వాటిలో సామాజిక హక్కు?
4. ఆదాయం, పొదుపునకు గల సంబంధం?
5. యూదుల పవిత్ర గ్రంథం?


ఇలా చేస్తే ఎక్కువ మార్కులు..


-8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలను సేకరించుకొని (అన్ని సబ్జెక్టులు) సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి
-సిలబస్‌ను నెలరోజులకు విభజించుకొని ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచింది. 
-తక్కువ మార్కులు ఉన్నవాటిని త్వరగా పూర్తి చేసి, ఆ తర్వాత ఆయా సబ్జెక్టుల సమయాన్ని పెంచుకుంటూ చదవాలి.
-రివిజన్ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ చేయడం, అనువర్తిత ప్రశ్నలు ఊహించుకుంటూ చదవడం వల్ల ప్రశ్నలను ఏ విధంగా అడిగినా జవాబు సులభంగా గుర్తించవచ్చు.
-పోటీ తీవ్రంగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి ప్రశ్నపత్రాన్ని రూపొందించేవారు సులభమైన ప్రశ్నలను కూడా రకరకాల కోణాల్లో అడిగే అవకాశం ఉంది.
-తరగతుల వారీగా సిలబస్‌ను చదవకుండా చాప్టర్స్ వారీగా ప్రిపేర్ అయితే మంచిది. అంటే సర్పిలాకార పద్ధతిలో అన్నమాట. ఉదాహరణకు ఘాతాంకాలు చాప్టర్‌ను 8, 9, 10 అన్ని తరగతుల్లో ఉన్న అంశాలను ఒకేసారి ప్రిపేర్‌కావాలి. 
-వేగంగా కాన్సెప్ట్ బేస్డ్ విధానంలో ప్రిపరేషన్ పూర్తిచేసి, సాధ్యమైనన్ని ప్రాక్టీస్ పేపర్స్‌ను చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
-పరీక్ష రాసే వరకు అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్ కొనసాగించండి.
ఆల్ ది బెస్ట్..!

No comments:

Post a Comment