తక్కువ వయస్సులో పక్కాగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజమార్గం. కేవలం ఇంటర్ అర్హతతో ఈ కోర్సు చేస్తే చాలు. ఆకర్షణీయమైన జీతం. విద్యార్హతలు పెంచుకుంటూ, ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం. స్వంత జిల్లాలో ఉన్న ఊరికి దగ్గర్లో దేశసేవ చేసుకొనే భాగ్యం. వీటన్నింటికి తొలి ప్రస్థానం డీఎడ్ సీటు సాధించడం. డీఎడ్‌లో ప్రవేశాల కోసం విద్యాశాఖ ప్రవేశపరీక్షను నిర్వహిస్తుంది. దీనిలో మంచి ర్యాంకు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 190 కాలేజీల్లో డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. డీఈఈసెట్(డైట్‌సెట్) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్ నేటి ప్రత్యేకం....
విద్యాహక్కు చట్టం అమలులోకి రావడంతో ప్రభుత్వాలు విద్య కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా నిర్భంద ప్రాథమిక విద్య అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దష్టిసారించాయి. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు మాత్రమే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అర్హులని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ కోర్సు చేసిన వారికి డిమాండ్ మరింత పెరిగింది.
పోస్టుల సంఖ్య భారీగా ఉండటం, డీఎడ్ చేసిన వారి సంఖ్య దానికి తగట్టుగా లేకపోవడంతో ఈ కోర్సు చేస్తే ఉద్యోగం గ్యారంటీ అనే పరిస్థితి నెలకొంది. గత రెండు డీఎస్సీల్లో డీఎడ్ కోర్సు చేసిన వారు లేకపోవడంతో ఎస్‌జీటీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పలు కేంద్ర పథకాలతో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పరిస్థితుల్లో విద్యపై మరింత శ్రద్ధ తీసుకొనే అవకాశం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అవసరమయ్యే పోస్టులను కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నింపాల్సిన పరిస్థితి.
వీటన్నింటి నేపథ్యంలో తప్పనిసరిగా భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పాత రాష్ట్రంలో 22వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. వీటికి తోడు పదవీవిరమణ ద్వారా మరికొన్ని, పాఠశాలల అప్‌గ్రేడ్‌తో ఇంకొన్ని పోస్టులు కలువనున్నాయి. రానున్న రెండు మూడేళ్లలో భారీగా ఉపాధ్యాయ పోస్టులు తప్పనిసరిగా నింపాల్సిన పరిస్థితి.